Sunday, March 22, 2009

Prajaswamyam

కళ్ళు మూసి కదులుతున్న ఓ ప్రజాస్వామ్యమా,
నీ అసలు అర్ధం ఎక్కడ ఉందో ఆ ప్రజలనే అడుగమ్మా!

మొన్న ఒకరు, నిన్న ఒకరు ఏలినారు ప్రభుత్వాలు,
కాని ప్రజల చెంత, ప్రజల వెంట తెచ్చినారా అధికారాలు?

'బీద, బడుగు, బలహీన వర్గాలు' అంటూ వినిపిస్తారు ఉపన్యాసాలు,
కాని 'అసలు' సమస్యల 'సమిధ' దిశ గా సాగుతాయా ప్రసంగాలు?

'ఉచిత' విద్యుత్తు, 'ఉచిత' టీవీ అంటూ పలుకుతారు ప్రలోభాలు,
కాని 'ఉచితంగా' వేల కోట్ల ప్రజల ధనం కొల్లగొడతారు ఆపై వారు!!

ఎనిమిది గంటల వ్యవధికి ఒక రైతు ప్రాణాలు వదులుతున్న 'కలవరం' మన 'రాష్ట్రం',
'రైతు రాజ్యం', 'అభివృద్ధి పధంలో రాష్ట్రం' అని పలికే 'సిగ్గుమాలిన' నేతలు ఎందరో ఈ దినం!

గ్రామాభివృద్దే దేశాభివృద్ధికి చిహ్నం అని అనెను బాపూ ఆ శకం,
గ్రామసీమల వరకు ఏల మన అడుగు ఈ శకం,
రాష్ట్ర రాజధాని లో ప్రభుత్వ ఆసుపత్రి తీరు చూస్తే మనం,
వైద్యం అందక, ఆరు బయటే అసువులు బాసిన వారి దీన గాధలు ప్రశ్నించెను ఈ దుర్దినం!

పథకాలు, వాటి ఫలాలు ప్రభుత్వం పెట్టే భిక్ష మాదిరి ఎదురుచూస్తే జనం,
అసలు ప్రభుత్వమే 'మనం' అన్న నిజం తెలుసుకునేది ఏ దినం?

ప్రజల గూర్చి ఆలోచించని నాయకులు గూర్చి ఎల్లకాలం మన మధనం,
ఎన్నికల కాలం లో నాయకుల పై నిలపకుంటే మన ధ్యానం,
ఆ 'పై' కాలం లోనూ రాదుగా మనకు వైభవం,
తప్పదుగా మనకు దినదిన పతనం!!

ప్రభుత్వ ఆఫీసులో పనులకు లంచాలు,
రోడ్ల నిర్మాణ ప్రమాణాలలో సర్దుబాట్లు,
నైపుణ్యం అందక అణగదొక్కబడిన వర్గాలు,
నైపుణ్యం ఉన్నా ఉపాధి అందని యువకిషోరాలు,
పగలు నుంచి రేయి దాకా కాలుష్యంలో కాపురాలు,
సరైన వైద్యం అందక బీద, మద్యతరగతుల ఆర్తనాదాలు,
అన్నదమ్ముల మద్య చెలరేగే మతవిధ్వేశాలు,
పంటలకు గిట్టుబాటు రాక, అప్పులు తాళలేక, రైతన్నల ఆకలి చావులు,
ఇదీ నేటి భారత చిత్రం!

ఇన్ని మబ్బుల చాటు దాగి ఉన్న ఓ ప్రజాస్వామ్యమా,
నీ అసలు 'కాంతి', దాని 'శాంతి' ఈ ప్రజలకు అందేది ఎప్పుడమ్మా?

ప్రజాస్వామ్యాన్ని నడిపించేది నాయకులు కాదు అని తెలుసుకో నేస్తమా,
ఆ నాయకులను ఎన్నుకునే ఈ ప్రజలే అని గ్రహించు మిత్రమా!

ఎన్నికలు అంటే నాయకుల కొరకు కాదు, 'మన' భవిష్యత్తు కొరకు అన్న నిజం ఎరుగు నేస్తమా,
'ఓటు' తో ప్రజాస్వామ్యంలో నీ 'చోటు'ను పదిలం చేసుకో మిత్రమా!!

3 comments:

Prashanth said...

ఫ్రకాష్, ఇన్ని రోజులకు నీలో ఉన్న కవి నిద్రలేచాడు.
ఫ్రకాష్, జీవి మాత్రమే కాదు, కవి కూడా అన్నమాట.

Very good work Prakash, Keep it up.


Prashanth.

G V Prakash said...

Thanks, Prashi!

Unknown said...

great truths,society needs must aware of these truths