Tuesday, September 25, 2012

సురాజ్యం

మేలుకోరా మేలుకోరా నవ ఉషోదయమై సోదరా,
నిజం ఎరిగి కదం కదిపి సురాజ్యంకై కదలిరా!

అర్ధగంటకు ఒక రైతు ప్రాణం విడిచే విషాద ఈ భారతిలో,
వెలుగు నింపే దీపం అవుతూ సురాజ్యంకై కదలిరా!

చదువు అందని కలలు పండని చిన్నారుల జీవితాలలో,
ప్రకాశమై చిరుహాసం పంచుతూ సురాజ్యంకై కదలిరా!

విద్య ఉన్నా ఉపాధి కొరతతో కలత చెందిన యువతకు,
సరి అవకాశాలతో భవిత చూపే సురాజ్యంకై కదలిరా!

వైద్యం అందక అలమటించే బీదవారి బ్రతుకులలో,
ఆయువు అయి నవ కాంతి నింపే సురాజ్యంకై కదలిరా!

మేలుకోరా మేలుకోరా నవ ఉషోదయమై సోదరా,
అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ అందరి బాగుకై నీవు కదలిరా!

సొంత లాభమే నిత్యం నడిచే నేటి రాజకీయం పారద్రోలి,
సమస్త హితమే సదా సాగే సురాజ్యంకై కదలిరా!

స్వరాజ్య సాధన స్ఫూర్తి విరిసిన అమరవీరుల భావితరమా,
తల్లి భారతి పిలుస్తోంది, సురాజ్య స్థాపనకై కదలిరండి!
వికాస జగతికి, దేశ ప్రగతికి పధం మీరై తరలిరండి!!
కులమతాలకు అతీతంగా, బాషాప్రాంత బేధాలకు అతీతంగా,
మంచి పెంచే చెడును తుంచే బాట మీదై సాగిపోండి!!

మేలుకోరా మేలుకోరా నవ ఉషోదయమై సోదరా,
నిజం ఎరిగి కదం కదిపి సురాజ్యంకై కదలిరా!!