Wednesday, October 05, 2011

ఒక్కటే ఒక్కటే!

ఒక్కటే ఒక్కటే!
తెలంగాణను తెరిచినా, సీమాంధ్రలో చూసినా -
కుటిల రాజకీయ కుంపటిలో కుళ్ళుతున్న వ్యవస్థ కథ ఒక్కటే,
కుళ్ళుతున్న వ్యవస్థలో అడుగడుగునా ప్రజల కన్నీటి వ్యధ ఒక్కటే!

దగాతో దోచుకునే దళారుల మాయదెబ్బకు,
గిట్టుబాటు ధరలు లేని రైతుల బాధలు ఒక్కటే!
పైపైకీ పెరుగుతున్న అప్పుల భారంకై,
ప్రాణమే విడుస్తున్న వారి దీన గాధలు ఒక్కటే!

ధనం లేనిదే చదువులేని దౌర్భాగ్యపు దుస్థితికి,
బడి జాడ నోచుకోని బిడ్డల బ్రతుకులు ఒక్కటే!
చదువుకున్నా ఉపాధి రాని విద్యార్ధుల మనసులపై,
మేఘమై కమ్ముతున్న నిరాశ, నిస్పృహ ఛాయలు ఒక్కటే!

వైద్యమే అరుదు'వరం'గా మారిన ప్రభుత్వాస్పత్రుల తీరుకు,
ఆరు బయటే అలమటిస్తూ వైద్యం కోసం ఎదురుచూపులు ఒక్కటే!
స్తోమతే సరితూగని ప్రైవేటాస్పత్రుల రుసుముల రక్కసికి,
వేదన తో రోదిస్తున్న అభాగ్యుల శోకసారాలు ఒక్కటే! 

ఒక్కటే ఒక్కటే!
తెలంగాణను తెరిచినా, సీమాంధ్రలో చూసినా -
సగటు మనిషి జీవిత సంగ్రామం ఒక్కటే!
దుష్టనాయకుల దుర్మార్గపు రాజకీయ రీతులు ఒక్కటే!

లేదుగా ఏ ప్రాంతీయ భావమూ ప్రజల కష్టనష్టాలకు,
నిలిచెనుగా ఇవి అనునిత్యం విషరాజకీయ చెంతకు!

మారాలి మారాలి!
దశాబ్దాల చెదలను చీల్చి, సువిశాల ప్రగతి వైపు,
వ్యవస్థ కథ మారాలి!
ద్వేషం చిమ్మే దుర్నీతి నుంచి, అభ్యుదయ జగతి వైపు,
రాజకీయం సాగాలి!

ఆగాలి ఆగాలి!
రాజకీయమే శాపమై, 'అభివృద్ధి' కాంక్షతో సాగే,
ఆత్మార్పణలు ఆగాలి!
జనం జనం ఒక్కటై, కదం పధం ఏకమై,
కుతంత్రాలను ఖననం చేసే శక్తి అయి కదలాలి!
సురాజ్య జగతికి జీవమై సాగాలి!!